25/10/2023
ఎగిరే ధిక్కార పతాకం కలేకూరి ప్రసాద్ జయంతి...
పిడికెడు ఆత్మ గౌరవం కోసం
నేను ఎప్పుడు పుట్టానో తెలియదు గానీ
వేల ఏళ్ళ క్రితం ఈ గడ్డ మీదే చంప బడ్డాను
‘పునరపి మరణం – పునరపి జననం’
నాకు కర్మ సిద్ధాంతం తెలియదు గానీ
మళ్ళీ మళ్ళీ మరణించిన చోటనే పుడుతున్నాను
నా దేశం ఈ దేశంలో కరిగిపోయి
గంగా సింధూ మైదానమైంది
నా కనుగుడ్లు కన్నీరై ద్రవిస్తే
ఈ దేశంలో జీవనదులు ప్రవహించాయి
నా సిరల నుండి జీవధాతువులు స్రవిస్తే
ఈ దేశం సస్య శ్యామలమై సిరులు కురిసింది
త్రేతా యుగంలో నేను శంభూకున్ని
ఇరవై ఏళ్ళ క్రితం నా పేరు కంచికచెర్ల కోటేశు
నా జన్మస్థలం కీలవేన్మని కారంచేడు నీరుకొండ
ఇప్పుడు కరుడుగట్టిన భూస్వామ్య క్రౌర్యం
నా గుండెల మీద నాగేటి కర్రులతో పచ్చ బొట్టేసిన పేరు చుండూరు
ఇక చుండూరు నామవాచకం కాదు సర్వనామం
ఇప్పుడు ప్రతి గుండె ఒక చుండూరు – రగిలే రాచ పుండూరు
నేను జన సమూహాల గాయాన్ని గాయాల సమూహాన్ని
తర తరాలుగా స్వతంత్ర దేశంలో అస్వతంత్రున్ని
అవమానాలకూ అత్యాచారాలకూ మాన భంగాలకూ చిత్ర హింసలకూ గురై
పిడికెడు ఆత్మ గౌరవం కోసం తలెత్తిన వాడిని
ధన మదాంధ కులోన్మత్తుల రాజ్యంలో
బతకడమే ఒక నిరసనగా బతుకుతున్న వాడిని
బతికి వున్నందుకు పదే పదే చస్తున్న వాడిని
నన్ను బాదితుడని పిలవకండి
నేను అమరుణ్ణి నేను అమరుణ్ణి నేను అమరుణ్ణి
లోకానికి సంపదను మిగిల్చేందుకు క్షామాన్ని మింగిన
గరళ కంటున్ని నేను
శీర్షాసనం వేసిన సూర్యోదయాన్ని
నిటారుగా నిలబెట్టేందుకు
సూర్యుని నెత్తి మీద ఈడ్చి తన్నిన వాడిని
రగిలే గుండె కొలిమిలో నినాదాలు కురిపిస్తున్న వాడిని
నాకు జాలి జాలి మాటలొద్దు కన్నీటి మూటలొద్దు
నేను బాదితున్ని కాను అమరుణ్ణి
ఎగిరే ధిక్కార పతాకాన్ని
నాకోసం కన్నీరు కార్చకండి – మీకు చాతనైతే
నగరం నడిబొడ్డున ఖననం చేయండి
జీవన రవళిని వినిపించే వెదురు వనాన్నై వికసిస్తాను
నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించండి
చరిత్ర పుటల్లోకి సుందర భవిష్యత్తునై పరివ్యాప్తిస్తాను
ఒక పెను మంటల పెనుగులాటనై
మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను…